రేపు వనదేవతల సమక్షంలోమేడారంలో మంత్రివర్గ భేటీ…
ప్రభుత్వ ముఖ్యులంతా రేపు మేడారం జాతరలోనే
ములుగు నుంచి మేడారం వరకు 45 కి.మీ. పరిధిలో దాదాపు 300 మంది బసకు ఏర్పాట్లు
రాత్రి బస, మరుసటి రోజు ఉదయం తల్లుల దర్శనం
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మేడారంలో వనదేవతలైన సమ్మక్క -సారలమ్మ సాక్షిగా జరగనున్నది …గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ హయాంలో ఒకసారి రాజధాని హైద్రాబాద్ వెలుపల మంత్రి వర్గ సమావేశం జరిగిన వనంలో జరగడం దాదాపు దేశ చరిత్రలో ఇదే ప్రధమం కానున్నదని తెలుస్తుంది .. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రి వర్గసమావేశానికి మంత్రులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ , వివిధ శాఖ అధికారులు ,ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పాల్గొంటారు ..
- రాష్ట్ర ప్రభుత్వం మేడారం అభివృద్ది పనులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది
- ఈ క్రమంలోనే ఈ దఫా మంత్రివర్గ సమావేశాన్ని అక్కడే నిర్వహించాలని నిర్ణయించింది
- మొట్టమొదటి సారిగా రాజధాని వెలుపల వనదేవతల సమక్షంలో మంత్రివర్గ భేటీ జరగనుండటంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు
- ఆదివారం (ఈ నెల 18న) సాయంత్రం కేబినెట్ భేటీ జరగనుండగా, సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురు కార్యదర్శులు ఆ..రాత్రి మేడారంలోనే బస చేయనున్నారు
మరుసటి రోజు ఉదయం పునర్నిర్మించిన గద్దెల ప్రారంభ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు.ఈ క్రమంలో ఆదివారం రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం రాజధాని నగరం నుంచి మేడారానికి చేరుకోనుంది .ఈ మంత్రివర్గ సమావేశానికి మేడారంలోని హరిత హోటల్ వేదిక కానుంది.
18న ఖమ్మంలో పలుకార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడారం చేరుకుంటారు.అంతకుముందే మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలువురు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుంటారు.సాయంత్రం 5 గంటల సమయంలో గద్దెల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.సీఎం, మంత్రులు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన అనంతరం హరిత హోటల్‌కు వెళ్లి మంత్రివర్గ సమావేశంలో పాల్గొంటారు.
300 మంది బస చేసేలా..!!
మంత్రివర్గ సమావేశానికి హాజరవుతున్న సీఎం, మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు ఆదివారం రాత్రి ఇక్కడే బస చేయనున్నారు.సీఎం, మంత్రులకు మేడారం హరిత హోటల్‌లోనే బసకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇందులో 16 గదులుండగా, టెంట్ సిటీగా ఇదే ప్రాంగణంలో మరో 40 తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు.తాడ్వాయి హరిత హోటల్‌లోని 30 గదులు, ములుగులోని వసతి గృహాలు, లక్నవరం, గోవిందరావుపేట, పస్రా, రామప్పలలోని ప్రైవేట్ గదులను ముందస్తుగా బుక్ చేశారు.ములుగు నుంచి మేడారం వరకు 45 కి.మీ. పరిధిలో దాదాపు 300 మంది బసకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.మంత్రి సీతక్కతో పాటు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
1,500 మందితో భద్రత..!! రాత్రి భోజనం హరిత ప్రాంగణంలో ఉండనుంది
రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యులందరూ మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో సమావేశం కానుండటం, రాత్రి బస, మరుసటి రోజు ఉత్సవాల్లో పాల్గొననుండటంతో ఈ కార్యక్రమాల భద్రతా ఏర్పాట్లను పోలీస్ శాఖ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
మేడారంలో ఉండి భద్రతా ఏర్పాట్లను ఎస్పీ సుధీర్ రాంనాథ్ పర్యవేక్షిస్తున్నారు
1,500 మంది పోలీసులు, ఐదుగురు ఎస్పీ ర్యాంకు అధికారులు, మరో నలుగురు ఐపీఎస్‌లు భద్రత కల్పించడంలో భాగస్వాములు కానున్నారు.రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడపనున్నారు .జాతర కోసం గత సంవత్సరం 3,500 బస్సులను ఉపయోగించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోంది దీనిని దృష్టిలో ఉంచుకుని అదనంగా 500 బస్సులను ఏర్పాటు చేశారు.ఈ 4,000 వేల బస్సులను ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని 51 పాయింట్ల నుంచి నడపనున్నారు.ఈ..నెల 25 నుంచి ఆయా ప్రాంతాల నుంచి సర్వీసులు ప్రారంభం కానున్నాయి దీనిలో మొత్తం 14 మంది సిబ్బంది సేవలు అందించనున్నారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఏసీ బస్సులను ఏర్పాటు చేయనున్నారు అయితే వాటికి ఆన్లైన్ రిజర్వేషన్ సదుపాయం కల్పించలేదు.రద్దీకి అనుగుణంగా సర్వీసులను సిద్ధం చేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది …