ఆంధ్రప్రదేశ్

విశాఖలో ‘ట్రాఫిక్ సోల్జర్స్’.. పోలీసులకు అండగా పౌర సైన్యం…

విశాఖపట్నం నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీసులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ట్రాఫిక్ సోల్జర్స్’ పేరుతో పౌర భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తూ సరికొత్త విధానాన్ని అమలులోకి తెచ్చారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి, ప్రజలలో రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ఆసక్తి కలిగిన 206 మందిని ఎంపిక చేసి, వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకున్నారు. ఈ నెల 16 నుంచి వీరు నగరంలోని 21 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సేవలు అందిస్తున్నారు.

ట్రాఫిక్ సోల్జర్స్ విధులు ఇవే
ఈ ట్రాఫిక్ సోల్జర్స్ ప్రధానంగా నగరంలోని రద్దీ కూడళ్లు, ఆసుప‌త్రులు, మార్కెట్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెడతారు. సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్‌లో డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, తప్పుడు ప్రదేశాల్లో పార్కింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనలను గుర్తిస్తారు. అయితే, జరిమానాలు విధించకుండా, వాహనదారులకు సున్నితంగా నచ్చజెప్పి, నిబంధనలపై అవగాహన కల్పిస్తారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారికి, డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్ వాడేవారికి రహదారి భద్రత ప్రాముఖ్యతను వివరిస్తారు. రద్దీ ప్రాంతాల్లో రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధులు, పిల్లలకు సహాయం చేయడం కూడా వీరి బాధ్యతల్లో ఒకటి. పండుగలు, ర్యాలీలు, వీఐపీల పర్యటనల సమయంలో ట్రాఫిక్ పోలీసులకు చేదోడు వాదోడుగా ఉంటారు.

స్వయంగా రంగంలోకి దిగిన సీపీ
ఈ కార్యక్రమం కోసం పోలీసులు నగరంలోని యువతతో మాట్లాడి, ట్రాఫిక్ నియంత్రణలో వారి పాత్ర ఎంత కీలకమో వివరించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారి నుంచి 206 మందిని ఎంపిక చేశారు. వీరికి నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ స్వయంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శిక్షణ ఇవ్వడం విశేషం. ప్రమాదాలు జరగకుండా ఎలా పనిచేయాలి, ప్రజలతో ఎలా వ్యవహరించాలనే దానిపై ప్రత్యేక సూచనలు చేశారు. ఈ సోల్జర్స్ ప్రతిరోజూ ఉదయం 8-10 గంటల మధ్య లేదా సాయంత్రం 4-7 గంటల మధ్య రద్దీ సమయాల్లో 3 నుంచి 4 గంటల పాటు సేవలు అందిస్తారు. త్వరలోనే వీరికి ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేయనున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ కార్యక్రమంలో చేరవచ్చని పోలీసులు తెలిపారు.

Related posts

చీమలపాడు ఘటన దురదృష్టకరం …బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి …!

Drukpadam

విజయవాడలో ఏపీజీఈఏ సమావేశాలు… ఉద్యోగులకు సెలవు మంజూరు చేసిన కూటమి సర్కారు!

Ram Narayana

భార‌త 15 రాష్ట్రప‌తిగా ద్రౌప‌ది ముర్ము….

Drukpadam