బడ్జెట్‌పై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరు గ్యారెంటీలకు ఘోరీ కట్టారని విమర్శించారు. అన్ని రంగాలకు మొండిచేయి చూపారని అన్నారు. ఈ బడ్జెట్‌లో సకల జనులకు దక్కింది గుండుసున్నా అని ఎద్దేవా చేశారు.
అంకెల గారడీ, మాటల గారడీ తప్ప బడ్జెట్‌లో ఏమీ లేదని అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పరిస్థితి బాగా ఉందని చెబుతున్నారని, మరోవైపు మూడేళ్లు కాకుండానే మూడున్నర లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో స్కాంలు తప్ప స్కీములు ఏమీ లేవని ఎద్దేవా చేశారు. మేడారం టెండర్లలో అవినీతి జరిగిందని స్వయంగా మంత్రి కుమార్తె ఆరోపణలు చేశారని గుర్తుచేశారు.
బడ్జెట్‌ను చూస్తుంటే ఇదో బోగస్ బడ్జెట్ అని అర్థమవుతోందని హరీశ్ రావు విమర్శించారు. గతంలో నిధులు కూడా ఖర్చు చేయని పథకాలకు మళ్లీ నిధులు కేటాయించడమేమిటని ప్రశ్నించారు. పెట్టుబడులు, ఉద్యోగ కల్పనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదని అన్నారు. ఈ ప్రభుత్వానికి టెండర్ల మీద ఉన్న ప్రేమ పేదల మీద లేదని అన్నారు. ఇది కాంగ్రెస్ పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.
వెనుక పిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని భట్టి విక్రమార్క రాజ్యాంగ విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి పడిపోయిందని అన్నారు. క్యూర్, రేర్, ప్యూర్ పేరుతో హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందని మండిపడ్డారు. కూల్చడాల మీద ఉన్న ప్రేమ నిర్మించడంపై లేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.