తమిళ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తమ అభ్యర్థులను నిలబెడుతున్నట్లు విజయ్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు.
ఈ జాబితాలో ఇతర పార్టీల నుంచి వచ్చిన పలువురు సీనియర్ నాయకులకు చోటు కల్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పుదుచ్చేరి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వి.స్వామినాథన్‌కు లాస్‌పేట స్థానం, ఇటీవల బీజేపీ నుంచి టీవీకేలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఏ.కె.సాయి జె. శరవణ కుమార్‌కు తిరుభువనై నియోజకవర్గం టికెట్ కేటాయించారు. వీరితో పాటు అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే కె.ఏ.యు.అసనా, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఎన్.ధనవేలు, పుదుచ్చేరి మాజీ డీఐజీ వి.జె.చంద్రన్ వంటి ప్రముఖులు కూడా టీవీకే తరఫున బరిలో నిలిచారు. ఈ జాబితాలో ఇద్దరు మహిళలకు కూడా విజయ్ ప్రాతినిధ్యం కల్పించారు.
ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పుదుచ్చేరి ఎన్నికలను విజయ్ ఒక ‘టెస్ట్ గ్రౌండ్’గా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో తన పార్టీ బలాన్ని అంచనా వేసుకోవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.