ముఖేశ్ అంబానీ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం… ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ కాల్ తో అప్రమత్తమైన పోలీసులు
-27 అంతస్తుల భవనంలో నివసిస్తున్న అంబానీ
-విలాసానికి కేరాఫ్ అడ్రస్ గా ముంబయిలోని ఆంటిల్లా
-గత ఫిబ్రవరిలో ఆంటిల్లా వద్ద పేలుడు పదార్థాలతో వాహనం
-అప్పటి నుంచి అప్రమత్తంగా ఉంటున్న పోలీసులు
అపర కుబేరుడు, రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య అధినేత ముఖేశ్ అంబానీ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఓ ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ కాల్ అందుకు కారణం. ముంబయిలోని ముఖేశ్ అంబానీ నివాసం ఆంటిల్లా గురించి ఇద్దరు వ్యక్తులు తనను అడిగారని, వారి వద్ద పెద్ద బ్యాగ్ ఉందని ఆ ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు.
దాంతో అప్రమత్తమైన పోలీసులు ముఖేశ్ నివాసం వద్ద అదనపు బలగాలను మోహరించారు. సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు. కాగా, ట్యాక్సీ డ్రైవర్ స్టేట్ మెంట్ ను రికార్డు చేశామని, ఓ సీనియర్ పోలీసు అధికారి పర్యవేక్షణలో దీనిపై విచారణ చేస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
గత ఫిబ్రవరిలో ముఖేశ్ అంబానీ నివాసం ఎదుట ఓ కారులో పేలుడు పదార్థాలు లభ్యం కావడం, దాని వెనుక పెద్ద కుట్ర బయటపడడం ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటినుంచి ఆంటిల్లా వద్ద చీమ చిటుక్కుమన్నా పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు. అందుకే ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ కాల్ ను తేలిగ్గా తీసుకోకుండా దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దింపారు.