షర్మిలను కలిసింది నిజం … కానీ ఇప్పుడు కాదు: పొంగులేటి..!
-కుమార్తె పెళ్లి కార్డు ఇవ్వటానికే వెళ్ళాను
-షర్మిలతో ఏం మాట్లాడాననేది త్వరలోనే తెలుస్తుంది
-వైఎస్సార్టీపీలో చేరుతానని మాట ఇచ్చారన్న షర్మిల
-ఏ పార్టీలో చేరుతాననే విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందన్న పొంగులేటి
-కొంతకాలం ఓపిక పట్టండని అభిమానులకు పొంగులేటి విజ్ఞప్తి
పార్టీ జెండా ఏదైనా తన అజెండా మాత్రం ఒకటేనని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో తన వెంట వచ్చిన వారిని గెలిపించుకోవడమే తన అజెండా అని చెప్పారు. వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కలిసినప్పుడు ఏం మాట్లాడాననేది త్వరలోనే తెలుస్తుందని అన్నారు.షర్మిలను కలిసిన మాట నిజం అయితే తన కుమార్తె పెళ్లి కార్డు ఇచ్చేందుకు వెళ్ళాను. ఆ సందర్భంగా అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. అంతేకాని పార్టీలోకి వస్తానని తాను ఎలాంటి హామీ ఇవ్వలేదని అర్థం వచ్చేలా ఆయన పేర్కొన్నారు . పార్టీలోకి రమ్మని ఆమె ఆహ్వానించారు చూద్దాం అని అన్నట్లు తెలుస్తుంది. దానిపై ఆమె చూద్దాం అంటే చేరతారని అనుకున్నట్లు భావించే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ఆయన అనుయాయులు పేర్కొంటున్నారు . పొంగులేటి ఏ పార్టీలో చేరేది త్వరలోనే క్లారిటీ వస్తుందని తెలుస్తుంది .
బీఆర్ఎస్ పార్టీపై పొంగులేటి తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. పార్ఠీ అధిష్ఠానంపై ఆయన నేరుగానే విమర్శలు సంధించారు. పార్టీలో తనకు చాలా అవమానం జరిగిందని చెప్పారు. ఆయన బీజేపీలో చేరవచ్చనే ప్రచారం జరిగింది. కొంతకాలం క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పొంగులేటిని ఒక ప్రవేట్ ఫంక్షన్ లో కలిశారు .ఆ సందర్భంగా వీరివురి మధ్య రాజకీయాల పై చర్చ జరిగింది. రేవంత్ కాంగ్రెస్ లోకి రమ్మని ఆహ్వానించారు . పొంగులేటి నవ్వుతు చూద్దాం లే అన్నట్లుగా తల కిందకు మీదకు ఊపారు . సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని మీడియా సమావేశంలో ఆహ్వానించారు . కాంగ్రెస్ నుంచి ,బీజేపీ నుంచి పెద్ద నాయకులే పొంగులేటికి నచ్చచెప్పడం ద్వారా తమ పార్టీకి తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు .