- తనకు రోజూ ఇన్సులిన్ ఇంజక్షన్లు కావాలని కేజ్రీవాల్ లేఖ రాశారన్న ఏఏపీ
- ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని ఎయిమ్స్ వైద్యలు చెప్పలేదన్న కేజ్రీవాల్
- రాజకీయ ఒత్తిడి కారణంగా జైలు అధికారులు అబద్ధం చెప్పారని ఆరోపణ
తనకు రోజూ ఇన్సులిన్ ఇంజక్షన్లు కావాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. మద్యం పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తనకు షుగర్ లెవల్స్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిరోజు ఇన్సులిన్ తీసుకోవడానికి అనుమతి కోరుతున్నానని పేర్కొంటూ సోమవారం ఈ లేఖను రాశారని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ముఖ్యమంత్రి ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఎయిమ్స్ వైద్యులు చెప్పినట్లుగా జైలు అధికారులు పేర్కొనడాన్ని ఆయన తోసిపుచ్చారు. జైలు అధికారులు రాజకీయ ఒత్తిడి కారణంగా అబద్ధం చెప్పారని జైలు సూపరింటెండెంట్‌కు రాసిన లేఖలో కేజ్రీవాల్ ఆరోపించారు.
జైల్లో వార్తాపత్రికలను చదివిన తర్వాత అధికారులు చెప్పిన విషయం విని బాధపడ్డానని కేజ్రీవాల్ ఆ లేఖలో పేర్కొన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. తీహార్ జైలు అధికారుల ప్రకటనలు అబద్ధమని చెప్పినట్లు పార్టీ వెల్లడించింది. తాను ప్రతిరోజు ఇన్సులిన్ అడుగుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారని స్పష్టం చేసింది.
ఎయిమ్స్ వైద్య నిపుణులతో కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 20న వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశామని, ఆ సమయంలో ముఖ్యమంత్రి ఇన్సులిన్ అంశాన్ని ప్రస్తావించలేదని, అదే సమయంలో డాక్టర్లు కూడా సూచించలేదని తీహార్ జైలు అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్.. సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు.