- ఈ మేరకు ప్రస్తుత జామ్ సాహెబ్ శత్రుసల్యసింహ్జీ దిగ్విజయ్ సింహ్‌జీ ప్రకటన
- క్రికెట్‌తో ఈ రాజ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం
- ఈ ఫ్యామిలీకి చెందిన కేఎస్ రంజిత్ సింహ్‌జీ, కేఎస్ దులీప్ సింహ్‌జీ పేర్లనే రంజీ, దులీప్ ట్రోఫీగా నామకరణం
రాయల్ ఫ్యామిలీ జామ్ నగర్ రాజ కుటుంబం తాజాగా కీలక ప్రకటన చేసింది. జామ్ నగర్ సంస్థానానికి కాబోయే మహారాజుగా భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా పేరును ప్రకటించింది. ప్రస్తుత జామ్ సాహెబ్ శత్రుసల్యసింహ్జీ దిగ్విజయ్ సింహ్‌జీ ఈ విషయాన్ని దసరా సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.
“పాండవులు తమ 14 ఏళ్ల అజ్ఞాత వాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని విజయం సాధించిన పర్వదినం దసరా. ఈ రోజు, అజయ్ జడేజా నా వారసుడిగా, నవానగర్(జామ్ నగర్ పాత పేరు) తదుపరి జంసాహెబ్‌గా ఉండటానికి అంగీకరించినందున నేను కూడా విజయం సాధించినట్లు భావిస్తున్నాను. ఇది జామ్ నగర్ ప్రజలకు గొప్ప వరం అని నేను విశ్వసిస్తున్నాను. ధన్యవాదాలు జడేజా” అని శత్రుసల్యసింహ్‌జీ పేర్కొన్నారు.
ఇక ఈ రాజ కుటుంబానికి క్రికెట్‌తో ప్రత్యేక అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఈ రాయల్ ఫ్యామిలీకి చెందిన కేఎస్ రంజిత్ సింహ్‌జీ, కేఎస్ దులీప్ సింహ్‌జీ పేర్లనే రంజీ, దులీప్ ట్రోఫీగా నామకరణం చేయడం జరిగింది. కాగా, జామ్ నగర్ రాజ కుటుంబంతో అజయ్ జడేజాకు మంచి అనుబంధం కూడా ఉంది.
ఇక అజయ్ జడేజా భారత జట్టుకు 1992 నుంచి 2000 వరకు ఆడాడు. టీమిండియా తరఫున 196 వన్డేలు, 15 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు.