- మోపిదేవి, బీదా మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామాతో మూడు స్థానాలు ఖాళీ
- వచ్చే నెల 20న ఎన్నికలు.. అదే రోజు ఫలితం
- ఒక స్థానంలో నాగబాబు ఫిక్స్ అయినట్టు సమాచారం
- రాజ్యసభ బరిలో వైసీపీ లేనట్టే
జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు త్వరలోనే రాజ్యసభకు వెళ్లబోతున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు, ఆర్. కృష్ణయ్య వేర్వేరు కారణాలతో రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. వచ్చే నెలలో ఎన్నికలు జరగనుండగా, జనసేన నుంచి నాగబాబును పెద్దల సభకు పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉండగానే ఈ విషయంపై క్లారిటీ వచ్చినట్టు తెలిసింది.
వచ్చే నెల మూడో తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 10న ముగుస్తుంది. 13 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో మెజార్టీ ఉండడంతో ఎన్నికలు జరగనున్న మూడు రాజ్యసభ స్థానాలూ కూటమికి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
ఒక్క అభ్యర్థి రాజ్యసభకు ఎన్నిక కావాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. వైసీపీకి ప్రస్తుతం ఉన్నది 11 మందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఈ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం దాదాపు లేనట్టే.