- పార్టీ సమావేశానికి ఎంపీలు రాకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం
- ఎంపీలు ఎందుకు రాలేదని లావు శ్రీకృష్ణదేవరాయలను ప్రశ్నించిన వైనం
- పార్టీ సమావేశం కంటే ఇతర పనులే ఎక్కువయ్యాయా అంటూ అసంతృప్తి
విధి నిర్వహణ విషయంలో సీఎం చంద్రబాబు ఎంత కచ్చితంగా ఉంటారో తెలిసిందే. తాజాగా, అలసత్వం ప్రదర్శించిన పలువురు మంత్రులు, ఎంపీలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు కావాల్సింది ఫొటోలకు పోజులు ఇవ్వడం కాదు… నాకు కావాల్సింది ఫలితాలు అని వారితో నిర్మొహమాటంగా చెప్పారు. ముఖ్యంగా, సోషల్ మీడియా వినియోగంలో విఫలమయ్యారంటూ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అదే సమయంలో, పార్టీ సమావేశానికి ఎంపీలు రాకపోవడం ఏంటని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును ప్రశ్నించారు. పార్టీ సమావేశం కంటే ఇతర పనులే ముఖ్యమా? అని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు… ఆయా జిల్లా ఇన్చార్జి మంత్రుల సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సమస్యలను ఇన్చార్జి మంత్రులకు చెప్పి పరిష్కరించాలని, ఎమ్మెల్యే తప్పు చేస్తే ఇన్చార్జి మంత్రిదే బాధ్యత అని హెచ్చరించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు… ఇన్చార్జి మంత్రులు, ఎంపీలు, జిల్లాల వారీ పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. చంద్రబాబు ప్రకటించిన ర్యాంకుల్లో కృష్ణా, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. చివరి మూడు స్థానాల్లో కడప, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి జిల్లాలు నిలిచాయి. సోషల్ మీడియా వినియోగంలో మంత్రి ఫరూక్ చివరి స్థానంలో నిలిచారు. ఈ విషయంలో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు.
కేంద్ర నిధుల సాధనకు ఎంపీలు, రాష్ట్ర మంత్రుల మధ్య సమన్వయం పెరగాలని అన్నారు. గత ఎన్నికల్లో 53 శాతం అనుకూల ఓటింగ్ నమోదైందని, దాన్ని 60 శాతానికి తీసుకెళ్లడంపై అందరూ కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.