Mallu Bhatti Vikramarka
తెలంగాణ వార్తలు

వైద్యంపై సంవత్సరానికి రూ.11,482 కోట్లు ఖర్చు – తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

  • రూ.11,600 కోట్లతో యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణం
  • 90 ట్రామా సెంటర్లు 450 కోట్ల రూపాయలతో ఏర్పాటు
  • భవిష్యత్ లో ఉద్యోగుల అవసరాలు కూడా తీరుస్తాం
  •  మానవ వనరుల అభివృద్ధికి పకడ్బందీ చర్యలు

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో నూతనంగా 8 కొత్త వైద్య కళాశాలలు మంజూరు చేసి, అవసరమైన భవనాలను నిర్మిస్తున్నామని డిప్యూటీ సీఎం  మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వ కంటే అధికంగా విద్యా, వైద్య రంగాలకు ని ప్రజా ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం 2014 నుండి 2024 వరకు సంవత్సరానికి సరాసరి వైద్యంపై రూ. 5 వేల 959 కోట్లు ఖర్చు చేస్తే, ఒక్క సంవత్సరంలోనే ప్రజా ప్రభుత్వం రూ.11 వేల 482 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. గురువారం ఆయన ఖమ్మం నియోజక వర్గంలోని రఘునాథపాలెం మండలంలో రూ.130 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన సముదాయ నిర్మాణ పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సి. దామోదర రాజనర్సింహ, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, రాందాస్ నాయక్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల రూపాయల నుంచి తమ ప్రభుత్వం పది లక్షలకు పెంచిందని, దీంతో 90 లక్షల కుటుంబాలకు లబ్ధి కలిగిందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం వైద్యంతో పాటు విద్యకు కూడా ప్రాధాన్యత కల్పించిందని, డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్స్ చార్జిలు 200 శాతం పెంచడం జరిగిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 58 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను మొదటి దఫా మంజూరు చేసి రూ.11 వేల 600 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టామన్నారు. రూ.22 వేల 500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నామని, రైతులకు రుణమాఫీ క్రింద 22 వేల కోట్ల రూపాయలు అందించామని, రైతు భరోసా క్రింద ఎకరానికి అందించే సహాయం రూ.12 వేలకు పెంచామని, రూ.12 వేల 500 కోట్లతో వ్యవసాయదారుల 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని, మహిళలకు ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలు పూర్తి చేస్తున్నామని చెప్పారు. సంక్షేమంతో పాటు ఖమ్మం జిల్లా ప్రజలకు సాగు నీరు అందించేందుకు సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తున్నామని, రూ.100 కోట్లు ఖర్చు చేసి రాజీవ్ లింక్ కెనాల్ నిర్మించి, నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరణ చేశామన్నారు. ప్రజా ప్రభుత్వం 57 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, మరో 30 వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతుందని, 9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం క్రింద స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. గిరిజన కుటుంబాలకు రూ.12 వేల 500 కోట్లతో ఇందిరా గిరిజన వికాసం పథకం క్రింద ఆర్వోఎఫ్ఆర్ పట్టాలకు సోలార్ పంప్ సెట్లు, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకర్లను అందిస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ, దుబారా ఖర్చులు చేయకుండా  ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు ఇస్తున్నామని, ఉద్యోగస్తుల అవసరాలను కూడా ప్రభుత్వం భవిష్యత్తులో తీరుస్తుందని డీప్యూటి సీఎం హామీ ఇచ్చారు.

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ వైద్య రంగంలో ప్రాథమిక వైద్యం చాలా అవసరమని, ఎక్కడైనా అవసరం ఉంటే మంజూరు చేస్తున్నామని, ఖమ్మం జిల్లాలో కూడా 6 పి.హెచ్.సి. లను మంజూరు చేస్తామని చెప్పారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ప్రజలు హైదరాబాద్ పై ఆధార పడకుండా ఇక్కడే సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రపంచ బ్యాంకు మంజూరు చేసిన రూ. 4 వేల 100 కోట్ల నిధుల నుంచి రీజనల్ క్యాన్సర్ సెంటర్ 37 కోట్లతో వరంగల్ కు, ఆర్గన్ రిట్రివల్ సెంటర్ ఖమ్మం జిల్లాలకు మంజూరు చేయబోతున్నామని ప్రకటించారు. ఎన్.సి.డి. రోగుల సంఖ్య రోజు, రోజుకు పెరుగుతోందని, దీనిని అరికట్టెందుకు ప్రతి జిల్లాకు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఖమ్మం ప్రాంతంలో వ్యాస్కులర్ యాక్సిస్ సెంటర్ ఏర్పాటు నిర్ణయం తీసుకుందని అన్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం ను 18 నుంచి 14 నిమిషాలకు తగ్గించేందుకు నూతనంగా 213 అంబులెన్స్ ప్రారంభించామని,  దీనిని 11 నిమిషాల తగ్గించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా ఆదివాసి మండలాల్లో 2 అంబులెన్స్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  ఖమ్మంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మిడ్ వైఫరీ కోర్సులు అందించేందుకు కృషి చేస్తామని, వీటి ద్వారా సి సెక్షన్  డెలీవరి తగ్గుతాయని అన్నారు. రాష్ట్రంలో జాతీయ, స్టేట్ రహదారులపై సుమారు 90 ట్రామా సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నామని,  బ్లాక్ స్పాట్ల వద్ద ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేసి అవసరమైన అన్ని ఏర్పాట్లు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య శాఖలో సుమారు 8 వేల పోస్టులను భర్తీ చేశామన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డా. నరేంద్ర కుమార్, టిజి ఎంఐడిసి ఎండి ఫణిoదర్ రెడ్డి, ఖమ్మం నగర మేయర్ నీరజ, డిసిసిబి చైర్మన్ వెంకటేశ్వర రావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. రాజేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. బి. కళావతి బాయి, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం ప్రధాన ఆసుపత్రి తనిఖీ

అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సి. దామోదర రాజనర్సింహ, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని తనిఖీ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రిసెప్షన్, హెల్ప్ డెస్క్, ఓల్డెజ్ క్లినిక్, ఐసియూ వార్డు, ఫార్మా విభాగం, ఫిమేల్ వార్డు, ల్యాబ్ లను డిప్యూటీ సీఎం, మంత్రుల బృందం పరిశీలించింది. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందుల విషయమై ఏర్పాటు చేసిన బోర్డును పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ పని తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

Related posts

రఫెల్ కూలాయన్న సీడీఎస్‌ను దేశద్రోహి అంటారా ?: ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీత

Ram Narayana

నేడోరేపో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ…శాఖల మార్పు జరిగే అవకాశం…

Ram Narayana

ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెట్… తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

Ram Narayana