- హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం
- యాసంగిలో కూడా రైతులకు బోనస్
- ఇండ్ల విషయంలో పొరపాట్లు జరగొద్దు

సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లలా ప్రజా ప్రభుత్వ పాలన సాగుతోందని తెలంగాణ రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం ఆయన పాలేరు నియోజక వర్గంలోని తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకుంటూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఒక వైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే, మరో వైపు అభివృద్ధి పనులు సైతం చేపట్టామని, పేదలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత నిస్తూ పాలన సాగిస్తుందని అన్నారు. ప్రభుత్వం రేషన్ కార్డు ద్వారా నిరుపేదలకు ఉగాది నుండి సన్న బియ్యం సరఫరా చేస్తుందని, ఇందిరమ్మ కమిటి అందించిన జాబితా ప్రకారం ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడతలో నిరుపేదలకు అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎక్కడా చిన్న పొరపాటు జరగడానికి వీలు లేదని మంత్రి ఈసందర్భంగా స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకం క్రింద యూనిట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. సన్న వడ్లకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇచ్చామని, యాసంగి సీజన్ లో కూడా రైతులకు బోనస్ చెల్లిస్తామని పేర్కొన్నారు. రైతులకు ఉన్న భూ సమస్యలను అధికారులు నేరుగా గ్రామాలకు వచ్చి పరిష్కరించే దిశగా భూ భారతి చట్టం ద్వారా చర్యలు తీసుకున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ క్రింద పేద కుటుంబానికి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందించేందుకు పరిమితిని 10 లక్షలకు పెంచామని తెలిపారు. పేదల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, గ్రామీణ నిరుపేదలకు ఇచ్చిన హామీ మేరకు చిత్త శుద్ధితో పని చేస్తామని చెప్పారు.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల అందజేత
మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అంతే కాకుండా, తిరుమలాయపాలెం మండలం రాకాసి తండా నుండి మన్నెగూడెం వరకు రూ. 375 లక్షలతో బీటీ రోడ్డు, పాతర్లపాడు క్రాస్ రోడ్ నుండి రావి చెట్టు తండా రోడ్డు వరకు 27 కోట్ల అంచనా విలువతో రెండు వరుసల రహదారిగా అభివృద్ధి పనులు, మహ్మదాపురంలో బోడతండ నుండి సుబ్లేడు, మేడిదపల్లి రోడ్డు నుండి భవాని గుడి వరకు ర్రో. 315 లక్షలతో బీటీ రోడ్డు, తెట్టెలపాడు గ్రామంలో ఏడు అంతర్గత సిసి రోడ్లు, గోపాలపురం నుండి జల్లేపల్లి వరకు రూ. 38 కోట్లతో రెండు వరసల రహదారి పనులు, చిన్న పోచారం నుండి కిష్టాపురం తాళ్ళచెరువు జెడ్పి రోడ్డు వరకు రూ. 280 లక్షలతో బీటీ రోడ్డు, జీళ్ళచెరువు గ్రామంలో రూ. 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఇ యాకుబ్, పీఆర్ ఎస్ఇ వెంకట్ రెడ్డి, హాస్సింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో నర్సింహా రావు, ఏడిఏ సరిత, తిరుమలాయపాలెం తహసీల్దార్ లూథర్స్ విల్సన్, ఎంపిడివో సిలార్ సాహెబ్, కూసుమంచి మండల తహశీల్దార్ కరుణశ్రీ, ఎంపిడివో వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
