తెలంగాణ వార్తలు

పంచాయతీ ఎన్నికల సిద్ధంగా ఉండాలి..రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని

గ్రామపంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితా తయారీపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్, జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొనగా, కలెక్టరేట్ నుంచి పోలీస్ కమీషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించిందని, సజావుగా ఎన్నికలు జరిగేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలను కుంటే, ప్రతి ఫేజ్ లో ఏ మండలాలు ఎన్నికలు జరగాలో జిల్లా వారీగా ప్రణాళికలు అందించాలని అన్నారు. పంచాయతీ తుది ఓటర్ జాబితాకు సంబంధించి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించి, ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి పోలింగ్ కేంద్రాలు, ఫోటోలతో కూడిన ఓటర్ జాబితా ప్రచురణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎంసిసి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఎంసిసి ఉల్లంఘనపై వచ్చే ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి యంత్రాంగం సిద్ధం చేసుకోవాలని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులతో మాట్లాడుతూ  గ్రామ పంచాయతీ, వార్డులకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ ఖరారు చేసి చెక్ చేసుకోవాలని, ప్రతి వర్గంలో మహిళలకు రిజర్వేషన్ 50 శాతం అమలు కావాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో  జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, జిల్లా పంచాయతి అధికారి ఆశాలత, జెడ్పి డిప్యూటీ సిఇఓ నాగపద్మజ, డివిజనల్ పంచాయతీ అధికారులు విజయలక్ష్మి, రాంబాబు, ఎన్నికల విభాగం సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Dedication Commission Report on Telangana Panchayat Election Reservations
  • పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన డెడికేషన్ కమిషన్
  • పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా నివేదిక
  • డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్న ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేషన్ కమిషన్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక నివేదికను సమర్పించింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా సిఫారసు చేసింది. రిజర్వేషన్ల అంశాన్ని తేల్చడానికి ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా నివేదిక సమర్పించింది.

డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ఈ నెల 24వ తేదీలోపు ఎన్నికల తేదీలను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో అదే రోజున విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 24న హైకోర్టు విచారణకు ముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది.

ఈ నెల 24 లేదా 25న షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో డిసెంబర్ 16 వరకు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది.

Related posts

ఫీజు రీయింబర్స్ మెంట్ పై కాలేజీల యాజమాన్యాల గగ్గోలు …ఫార్మసీ కాలేజీల మూత!

Ram Narayana

పెట్టుబడుల ఆకర్షణ కోసం జపాన్ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

వ్యవసాయ కూలీలపై పిడుగు .. ముగ్గురు దుర్మరణం!

Ram Narayana