అర్హులందరికీ అక్రిడేషన్లు ఇస్తాం … మీడియా అకాడమీ చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డి
అక్రిడిటేషన్ల కార్డులు ఇవ్వడమనేది నిరంతర ప్రక్రియ
జర్నలిస్టులను ఎలైట్ సెక్షన్ నుంచి తొలగించాలని తీర్మానం..
వృత్తికి గౌరవం పెరగాలంటే నకిలీలు కార్డులు పొందకుండా చూడాలి …అమర్
హెల్త్ పథకం జర్నలిస్టులకు వర్తించేలా ప్రభుత్వంపై వత్తిడి తేవాలి ..నరేందర్ రెడ్డి
మీడియా అకాడమీ శిక్షణ తరగతులను ఉపయోగించుకోండి …విరాహత్ అలీ


అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్లు ఇస్తామని యూనియన్ సలహాదారు , మీడియా అకాడమీ చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డి అన్నారు . టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం ఏప్రిల్ 16 న రాష్ట్ర అధ్యక్షులు కె .విరాహత్ అలీ అధ్యక్షతన మేడ్చల్ జిల్లాలోని ఎస్ ఎన్ ఆర్ పుష్ప కన్వెన్షన్ హాల్ లో జరిగింది .సమావేశానికి రాష్ట్రంలోని 30 జిల్లాలనుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ,జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరైయ్యారు .. సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కె .శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మీడియా తో సంబంధం లేకుండా అక్రిడిటేషన్ కార్డులు పొందాలను కునేవారికి ఎట్టి పరిస్థితిలోను కార్డులు జారీ చేయకుండా చూడాల్సిన భాద్యత అక్రిడిటేషన్ కమిటీలదేనని స్పష్టం చేశారు …కొంతమంది వార్తలు రాయకుండానే కార్డులు తీసుకోని ఎంజాయ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలాంటివారికి కార్డులు ఇవ్వడం నేరమవుతుందని అన్నారు . కొందరు కార్డులను డబ్బులు పెట్టి కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతున్నారని, ఇది నిజమైన జర్నలిస్టులకు అవమానకరమన్నారు .. దీనిపై అధికారులకు , అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు మరింత అవగాహనా కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు ..తాము కూడా కొన్ని జిల్లాలలో అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియను పరిశీలిస్తామని తెలిపారు ..రాష్ట్రలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి ,సమాచారశాఖ మంత్రి అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీచేశారని పేర్కొన్నారు ..డెస్క్ జర్నలిస్టులకు ఎడిషన్ సెంటర్లలో ముగ్గురికి నలుగురికి మాత్రమే కార్డులు వస్తున్నాయని వాటిని మార్చాలని వచ్చిన విజ్ఞప్తిని రాష్ట్ర అక్రిడిటేషన్ కమిటీలో చర్చించి ఎంతమంది డెస్క్ లో పనిచేస్తే అంతమందికి కార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచిస్తూ సిఫార్స్ చేయడం జరిగిందని ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి డెస్క్ జర్నలిస్టులందరికీ కార్డులు ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు ..అంతే కాకుండా కేబుల్ టీవీ చానళ్లకు కూడా వారు చేస్తున్న ప్రసారాల ఆధారంగా కార్డులు ఇవ్వనున్నామన్నారు … పెద్ద ,చిన్న ,మీడియం తరగతి పత్రికలకు వారి సర్క్యూలేషన్ ఆధారంగా కార్డులు వస్తాయని అన్నారు ..అదేవిధంగా మండల ,జిల్లా రాష్ట్ర కార్డులు పొందే విలేకర్లకు గత అనుభవం ఉంటె చదువుతో సంబంధం లేదని అది కొత్తగా వచ్చేవారికి మాత్రమేనని శ్రీనివాస్ రెడ్డి వివరించారు .. అక్రిడిటేషన్లు ఇవ్వడమనేది టైం బాండ్ కాదని నిరంతర ప్రక్రియని తెలిపారు …

సమావేశంలో పాల్గొన్న ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ చిక్కు ఎక్కడ వస్తుందంటే అక్రిడిటేషన్లు దగ్గర.. మన సమావేశం కూడా దాని చుట్టే తిరిగింది ..మన నాయకుడు మీడియా అకాడమీ చైర్మన్ గా , అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ గా ఉన్నారని మనకు ఎక్కువరావాలి అనుకుంటాం . కానీ నిబంధనలు ఏమి చెపుతున్నాయి ..ఎలా ఉన్నాయనేది చూడాలి …అక్రిడిటేషన్ కార్డు ఉంటేనే ఇళ్లస్థలం వస్తుందనే ఉద్దేశంతో అనేక మంది వృత్తికి సంబంధం లేకపోయినా కార్డులు పొందుతున్నారు .. అలాంటి వాటిని అరికట్టాలి, మన సభ్యులను అందుకు అనుగుణంగా ఎడ్యుకేట్ చేయాలి … అక్రిడిటేషన్ కార్డు కు ఇళ్లస్థలానికి లింక్ వల్లనే సమస్య వస్తుంది . నిజమైన జర్నలిస్టులకు లబ్ది జరగాలి . కార్డు కాదు ముఖ్యం నిజమైన జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందాలి…అదే సందర్భంలో నకిలీలు లేకుండా చేయాలి ..అప్పుడే వృత్తికి,మనకు గౌరవం పెరుగుతుంది ..గత చరిత్ర లేని కొన్ని సంఘాలు అనైతికానికి పాల్పడుతున్నాయి .అర్హతలేనివాళ్ళు జర్నలిస్టులిజం ముసుగులో తిరుగుతున్నారు …అలాంటివారికి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వరాదు …ప్రభుత్వాలు ఉన్న కార్డులనే తొలగించాలని చూస్తున్నాయి…ఇప్పటికే రైల్వే పాసులకు మంగళం పాడారు. వృత్తి నిబంధనలతో పనిచేసేవారికి కార్డులు ఇవ్వాలి . సంఖ్యను పెంచుకోవడం కోసం యూనియన్ పనిచేయరాదు .యూనియన్ నిర్మాణం గురించి సభ్యులకు తెలియజేయాలని అమర్ కోరారు ..

ఐజేయూ ఉపాధ్యక్షులు వై నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విజయవాడలో అత్యంత జయప్రదంగా జరిగిన ఐజేయూ 11 వ ప్లినరీ సమావేశాల్లో జర్నలిస్టుల సమస్యలపై 11 తీర్మానాలు చేయడం జరిగిందని వాటిలో వర్కింగ్ జర్నలిస్టుల యాక్ట్, వేజ్ బోర్డు ఏర్పాటు , లేబర్ కోడ్ ,రైల్వే పాసుల పునరుద్ధరణపై ,మీడియా కమిషన్ ఏర్పాటు , ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా ను మీడియా కౌన్సిల్ గా మార్చాలని ,జర్నలిస్టులను ఎలైట్ సెక్షన్ నుంచి తొలగించాలని వివిధ తీర్మానాలు చేయడం జరిగిందన్నారు .దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మహిళా జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనడం శుభపరిణామని అన్నారు ..రాష్ట్రలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు కోసం సీరియస్ ప్రయత్నం జరగాలని అన్నారు .. మీడియా ప్రతినిధులపై పోలిసుల కేసులు ,బెదిరింపుల గురించి నిజనిర్దారణ కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు ..

సమావేశంలో ఐజేయూ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్ , కల్లూరి సత్యనారాయణ , కె .అజిత ,కె .రాములు , రాష్ట్ర కోశాధికారి మోతె వెంకటరెడ్డి , మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు , గడ్డమీది బాలరాజు గౌడ్ ,వెంకట్రామ్ రెడ్డి , రాష్ట్ర ఆఫీస్ బేరర్లు , ఫైజల్ అహ్మద్ ,గాడిపల్లి మధు గౌడ్ ,బుర్ర సంపత్ , కార్యదర్శులు కె.శ్రీకాంత్ రెడ్డి , వి .యాదగిరి ,గుండ్రాతి మధు గౌడ్ లతోపాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు , వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు , ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు .. తొలుత అతిధులను మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బాలరాజు వేదికపైకి ఆహ్వానించారు ….

సమావేశానికి అధ్యక్షత వహించిన విరాహత్ అలీ తన తొలిపలుకుల్లో రాష్ట్రంలో సంఘం చేపట్టిన వివిధ కార్యక్రమాలను గుర్తు చేశారు . అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు వచ్చేలా కమిటీ చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డి ఆధ్వరంలో జరుగుతున్న కృషిని గురించి వివరించారు ..గతంలో యూనిట్ సెంటర్లలో డెస్క్ జర్నలిస్టులకు మూడు నాలుగు మాత్రమే కార్డులు వచ్చేలా జి ఓ లో ఉందని దాన్ని మార్చుతూ డెస్క్ లో ఎంతమంది జర్నలిస్టులు పనిచేస్తే అంతమందికి కార్డులు ఇవ్వాలని కమిటీ చైర్మన్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి చేసిన కృషికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు .అందుకు వారికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు .. అదే విధంగా కేబుల్ టీవీ ఛానల్ లోపనిచేస్తున్న విలేకర్లకు వారి ప్రసారాలను బట్టి కార్డులు ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు .. మహాసభల గడువు తీరిన జిల్లా సభలు మే ,జూన్ మాసాలలో సభలు జరపాలని లేకపోతె రాష్ట్ర కమిటీ తగు నిర్ణయం తీసుకుంటుందని అన్నారు .. మీడియా అకాడమీ ఆధ్వరంలో జరుగుతున్న శిక్షణ తరగతులను జిల్లాలు ఉపయోగించుకోవాలని కోరారు …అనంతరం జిల్లాలవారీగా మాట్లాడిని ప్రతినిధులు మహాసభలకు తేదీలను ఇచ్చారు .దీనిపై సమావేశం ప్రత్యేక ఫోకస్ చేసింది …


సమావేశ ప్రారంభంలో ఇటిల మృతి చెందిన జర్నలిస్టు మిత్రులకు , అంతకు ముందు రోజు రోడ్ ప్రమాదంలో మృతి చెందిన ఖమ్మం జిల్లాకు చెందిన పీసీసీ సభ్యులు , మన యూనియన్ కు అత్యంత ఆప్తులు, స్నేహశీలి , మహమ్మద్ జావేద్ మరణం పట్ల సమావేశం తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది …సభ్యులు రెండు నిముషాలు మౌనం పాటించారు ..

యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె .రాంనారాయణ గత సమావేశం నుంచి ఇప్పటివరకు జరిగిన కార్యకలాపాల రిపోర్ట్ ను భవిష్యత్ కార్యక్రమాలను ప్రవేశ పెట్టారు …పెండింగ్ లో ఉన్న జిల్లా మహాసభలను జరపాలని ,మీడియా అకాడమీ ద్వారా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను జిల్లా కమిటీలు ఉపయోగించుకోవాలని ,ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాలు త్వరలో నిర్వహించాలని ,ఇళ్లస్థలపై ఎమ్మెల్యేలు , ఎంపీలు , మంత్రుల వద్ద వత్తిడి పెంచాలని ,ఉద్యోగులకు మాదిరిగానే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందించేందుకు కృషి చేయాలనీ ,మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సు ,వివిధ సంఘాలతో ఏర్పడిన జాతీయ కాన్ఫెడరేషన్ సమావేశాలకు ఆతిధ్యం ఇవ్వాలని అన్నారు ..
జర్నలిస్టులను ఎలైట్ సెక్షన్ జాబితాలో చేర్చడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీర్మానం …
సమావేశంలో హైద్రాబాద్ లోని జవర్ లాల్ నెహ్రు హోసింగ్ సొసైటీ విషయంలో సుప్రీం కోర్ట్ జర్నలిస్టులను కూడా ఎలైట్ సెక్షన్ గా భావించి ఇళ్లస్థలాల విషయంలో తీర్పు నివ్వడంపై సమావేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది .. ఈ తీర్మానాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ,హోసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షులు బొమ్మగాని కిరణ్ కుమార్ ప్రవేశ పెట్టారు .. అతి తక్కువ వేతనాలతో ,అసలు వేతనాలు లేకుండా జీవనం సాగిస్తున్న జర్నలిస్టుల విషయంలో సుప్రీం నిర్ణయాన్ని సమావేశం తప్పు పట్టింది ..ఇప్పటికైనా గౌరవ న్యాయస్థానాలు జర్నలిస్టులను ఎలైట్ సెక్షన్ నుంచి తొలగించి న్యాయం చేయాలనీ విజ్ఞప్తి చేసింది ..
రాష్ట్రంలో జర్నలిస్టులపై పోలిసుల వేధింపుల … పరిశీలనకు కమిటీ
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వ్యతిరేక వార్తలు రాసిన విలేకరులపై పోలీసులు కేసులు నమోదు చేసి వేదింస్తున్నారని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ప్రభుత్వానికి , పోలీస్ ఉన్నతాధికారులకు రెప్రజెంట్ చేసేందుకు ఒక కమిటీని నియమించాలని సమావేశం తీర్మానం చేసింది ..
త్వరలో హైద్రాబాద్ కేంద్రంగా ఐజేయూ ఆధ్వరంలో జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సు , అదే విధంగా వివిధ జర్నలిస్ట్ సంఘాలతో ఏర్పడిన కాన్ఫెడరేషన్ సభను హైద్రాబాద్ లో జరిపేందుకు సమావేశం ఆమోదం తెలిపింది ..
టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వరంలో ఏర్పాట్లను ఘనంగా జరిగాయి ..ప్రత్యేకంగా గత వారం పదిరోజులుగా యూనియన్ రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్ రెడ్డితోపాటు , ఆ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గడ్డమీది బాలరాజు గౌడ్ , వెంకట్రామ్ రెడ్డి వారి టీం చేసిన కృషిని రాష్ట్ర కమిటీ అభినందించింది ..
నందిని సిధారెడ్డి కి టీయూడబ్ల్యూజే ఘన సన్మానం …


కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత మన యూనియన్ కు అత్యంత ఆప్తులు సాహిత్య రంగంలో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకున్న నందిని సిద్ధారెడ్డి ని యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా అన్ని జిల్లాలనుంచి వచ్చిన యూనియన్ నాయకుల సమక్షంలో ఘనంగా సన్మానించడం జరిగింది. యూనియన్ సలహాదారు ,మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి ,ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు , ఐజేయూ మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్ , యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ సాహిత్య రంగంలోనే కాకుండా సామజిక రంగంలో ఆయన చేస్తున్న విశిష్ట సేవలను గుర్తు చేశారు …కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ , ఐజేయూ ఉపాధ్యక్షులు వై .నరేందర్ రెడ్డి , ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్ , కల్లూరి సత్యనారాయణ , కాట్రగడ్డ అజిత , యూనియన్ రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి , మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గడ్డమీది బాలరాజు గౌడ్ , వెంకట్రామ్ రెడ్డి , సిద్ధిపేట యూనియన్ అధ్యక్షులు రంగాచారి లు పాల్గొన్నారు …




