- ఇంకా ధృవీకరించని అధికార వర్గాలు
- 5 రోజులుగా ఆపరేషన్ కొనసాగిస్తున్న భద్రతా బలగాలు
- ఆపరేషన్ నిలిపి వేయాలని పౌర హక్కుల సంఘాల డిమాండ్

దండకారణ్యంలోని కర్రెగుట్టల్లో మావోయిస్టులపై కేంద్ర బలగాలు 5 రోజులుగా ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ ఆపరేషన్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందునట్లు వార్తలొస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే, మృతుల సంఖ్యను ఇంకా అధికారికంగా ధృవీకరించ లేదు. మావోయిస్టుల బలంపైన భారీ దెబ్బ పడ్డప్పటికీ, కొన్ని చోట్ల వారు కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు పౌర హక్కుల సంఘాలు ఆపరేషన్ నిలిపి వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మావోయిస్టులను పూర్తి స్థాయిలో అంతమొందించడమే లక్ష్యంగా కేంద్ర బలగాలు కర్రె గుట్టల అడవుల్లో కొనసాగిస్తున్న ఈ ఆపరేషన్ రోజు రోజుకూ ఉత్కంఠ రేపుతోంది. మావోయిస్టులు భారీగా తల దాచుకున్నారనే సమాచారంతో, దాదాపు 20 వేల మంది భద్రతా సిబ్బందితో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అటవీ ప్రాంతంలో సుమారు 1000 మందికి పైగా మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో, భద్రతా బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో డ్రోన్‌లు, హెలికాప్టర్‌లు రంగంలోకి దిగి మావోయిస్టులపై బాంబుల వర్షం కురిపించినట్లు వార్తలు వస్తున్నాయి.

. ప్రస్తుతం కర్రెగుట్టల్లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ కగార్‌లో భాగంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది. కర్రెగుట్టలే టార్గెట్‌గా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. భద్రతాబలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది.
మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌తో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అంతా వార్‌జోన్‌గా మారింది. మావోయిస్టుల అగ్రనేతలే టార్గెట్‌గా సాగుతున్న ఆపరేషన్ కర్రెగుట్టల్లో గత నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున కూంబింగ్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇక మావోయిస్టులకు పెట్టని కోటలాగా కర్రెగుట్టలు ప్రాంతం ఉంది. 145 ఎకరాల విస్తీర్ణం ఉన్న కర్రెగుట్టల చుట్టూ దాదాపు పదివేల మంది భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టు సుప్రీం కమాండర్ హిడ్మాతో పాటు వేలాది మంది మావోయిస్టులు ఉన్నట్లు భద్రతాబలగాలు గుర్తించాయి. వారి లక్ష్యంగానే కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ములుగు జిల్లా సరిహద్దు నుంచి ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా వరకు అలాగే మహారాష్ట్రలో గడ్చిరోలి ప్రాంతంలో ఉన్న నదుల నుంచి మావోయిస్టులు తప్పించుకోకుండా మూడు వైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దాదాపు కొద్ది రోజులుగా కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం వేట కొనసాగుతోంది. అధునాత ఆయుదాలతో సాటిలైట్స్, డ్రోన్స్‌ను ఉపయోగిస్తూ మావోయిస్టులపై పై..నుంచి బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భీకరమైన కాల్పుల్లో ఇప్పటి వరకు 38 మంది మావోయిస్టుల చనిపోయినట్లు తెలుస్తోంది.
