- ఆపరేషన్ సిందూర్ పై విదేశాలకు బ్రీఫింగ్ కోసం అఖిలపక్షం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం
- కాంగ్రెస్ తరఫున నలుగురు ఎంపీల పేర్లు ఇచ్చిన ఖర్గే
- అందులో పేరులేకున్నా శశిథరూర్ ను ఎంపిక చేసిన కేంద్రం
- బృందం నాయకత్వ బాధ్యతలు శశిథరూర్ కు అప్పగింత
ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణాలు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు వివరించేందుకు అఖిలపక్ష బృందాన్ని పంపాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందుకోసం తమ తమ పార్టీల తరఫున సభ్యుల పేర్లను సూచించాలని కోరింది. దీనికి స్పందించిన కాంగ్రెస్ పార్టీ నలుగురు ఎంపీల పేర్లతో కూడిన ఓ జాబితాను కేంద్రానికి సమర్పించింది. ఇందులో ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ పేరు లేనేలేదు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ నుంచి శశిథరూర్ ను ఎంపిక చేయడమే కాకుండా ఏకంగా ప్రతినిధి బృందానికి ఆయననే నాయకుడిగా చేసింది.
ప్రతినిధి బృందం కోసం నలుగురు సభ్యుల పేర్లను సూచించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మే 16న కోరినట్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అదే రోజు మధ్యాహ్నానికి ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్, రాజా బ్రార్ ల పేర్లను కాంగ్రెస్ తరఫున పంపించినట్లు తెలిపారు. ఈ జాబితాలో శశి థరూర్ పేరు చేర్చలేదు. అయితే, తిరువనంతపురం నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన శశి థరూర్ ఈ అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఆపరేషన్ సిందూర్… విదేశాలకు వెళ్లి బ్రీఫింగ్ చేయనున్న ఏడు ఎంపీల బృందాలు

- పాక్ ఉగ్ర కుట్రలపై ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత ఎంపీల బృందాలు
- పది రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించనున్న ఏడు అఖిలపక్ష బృందాలు
- కేంద్రం ప్రకటించిన టీమ్ లీడర్లలో కాంగ్రెస్ నుంచి శశిథరూర్
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ వైఖరిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, వివిధ దేశాలకు పార్లమెంటు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలను పంపాలని నిర్ణయించింది. ఈ బృందాలు పాకిస్థాన్ ఉగ్ర కుట్రలను, వాటిని ఎదుర్కోవడానికి భారత్ తీసుకుంటున్న చర్యలను అంతర్జాతీయ సమాజానికి వివరించనున్నాయి.
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు పార్లమెంటు సభ్యుల పేర్లను ఈరోజు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్‌తో పాటు, రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ), బైజయంత్ పాండా (బీజేపీ), సంజయ్ కుమార్ ఝా (జేడీయూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ – ఎస్పీ), శ్రీకాంత్ షిండే (శివసేన) ఈ జాబితాలో ఉన్నారు.
ఈ ఎంపీల నేతృత్వంలోని ఏడు బృందాలు, మే 22న విదేశీ పర్యటనకు బయలుదేరి, పది రోజుల వ్యవధిలో ఐదు దేశాలను సందర్శించనున్నాయి. జూన్ మొదటి వారంలో ఈ బృందాలు తిరిగి వస్తాయని సమాచారం. ఈ పర్యటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో సంప్రదింపులు జరిపిన అనంతరమే సభ్యులను ఎంపిక చేసింది.
ఈ ప్రతినిధి బృందాలు ప్రధానంగా ఐదు కీలక అంశాలను ప్రపంచ దేశాలకు వివరించనున్నాయి:
1. “ఆపరేషన్ సిందూర్” చేపట్టడానికి దారితీసిన పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలు.
2. పాకిస్థాన్ బెదిరింపులకు ప్రతిగా భారత్ “ఆపరేషన్ సిందూర్”ను ఎలా సమర్థవంతంగా నిర్వహించిందో తెలియజేయడం.
3. భవిష్యత్తులో భారత్‌పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే కఠిన చర్యలపై స్పష్టత ఇవ్వడం.
4. “ఆపరేషన్ సిందూర్” సమయంలో కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని, సాధారణ పౌరులకు ఎలాంటి హాని జరగలేదని స్పష్టం చేయడం.
5. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్థాన్ దీర్ఘకాలంగా అనుసరిస్తున్న విధానాన్ని, దాని వల్ల ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పును ఆధారాలతో సహా వివరించడం.