- రాజౌరీ జిల్లాలో మృత్యు ఘంటికలు మోగిస్తున్న వ్యాధి
- చిన్నారులను కబళిస్తున్న వ్యాధి
- బధాల్ గ్రామంలో అత్యధికంగా మరణాలు
జమ్ము కశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో అంతుచిక్కని వ్యాధితో చిన్నారులు మృత్యువాత పడుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో చిన్నారి కూడా వ్యాధి ఏమిటో తెలియకుండానే మరణించడంతో, ఇప్పటిదాకా ఈ మిస్టరీ జబ్బుతో ప్రాణాలు విడిచిన చిన్నారుల సంఖ్య 13కి పెరిగింది.
డిసెంబరు 24 నుంచి మృత్యు ఘంటికలు మోగిస్తున్న ఈ వ్యాధితో ఒక్క బధాల్ గ్రామంలోనే అత్యధికంగా చిన్నారులు మరణించారు. దాంతో, బధాల్ గ్రామంలో ప్రజలు హడలిపోతున్నారు. ఈ జబ్బు బారినపడిన పిల్లలను స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోతోంది. అధిక జ్వరం, తీవ్రంగా చెమటలు పట్టడం, వాంతులు, కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోతుండడం… ఈ మిస్టరీ వ్యాధి లక్షణాలు.
దీనిపై రాజౌరీ మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ అశుతోష్ గుప్తా స్పందించారు. ప్రాథమికంగా ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అని భావిస్తున్నామని, మరిన్ని పరీక్షల తర్వాత దీనిపై ఓ నిర్ధారణకు వస్తామని వెల్లడించారు.
అటు, ఈ వ్యాధి ఏమిటన్నది తెలుసుకునేందుకు పుణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పీజీఐ (చండీగఢ్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎయిమ్స్ వంటి ప్రఖ్యాత సంస్థల నుంచి నిపుణులు బధాల్ గ్రామానికి తరలివెళ్లారు.