ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి….. జిల్లా కలెక్టర్
భూ సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు
ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర బీసీ, రవాణా శాఖల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు సీఎస్ కే. రామకృష్ణారావులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సమీక్షించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు.
భూ భారతి చట్టం అమలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, వన మహోత్సవం వంటి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై మంత్రులు వీడియో సమావేశం ద్వారా సమీక్షిస్తూ కలెక్టర్ లకు పలు సూచనలు జారీ చేశారు. ఆగస్టు 15 నాటికి భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వన మహోత్సవం కార్యక్రమం క్రింద జూలై నెలాఖరు నాటికి నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత పట్ల అప్రమత్తంగా ఉండాలని, పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని మంత్రులు ఆదేశించారు. 200 కోట్ల ప్రయాణాలు మహిళలు ఉచితంగా బస్సులలో చేసినందున బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్ డిపోలలో, 341 బస్ స్టేషన్లలో సంబరాలు ప్రత్యేక కార్యక్రమంలో నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పిలుపునిచ్చారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ కామేపల్లి, ఇల్లందు, సింగరేణి మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక ఇబ్బంది ఉంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సత్తుపల్లి మండలానికి ముల్కలపల్లి నుంచి ఇసుక తెచ్చుకునేలా సమన్వయంతో పని చేస్తామని అన్నారు. వీసీ అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్ జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఖమ్మం జిల్లాలో రెసిడెన్షియల్ విద్యా సంస్థలను మండల ప్రత్యేక అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి భోజనం నాణ్యత ను తనిఖీ చేయాలని అన్నారు. ఒక చెక్ లిస్ట్ ప్రకారం అక్కడ అందించే భోజనానికి మార్కులు అందించాలని, ప్రతి వారం ఈ తనిఖీలపై రివ్యూ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో ఎట్టి పరిస్థితులు బయట ఫుడ్ అనుమతించడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.భూ భారతి పెండింగ్ దరఖాస్తులలో త్వరగా పరిష్కరించే వాటికి ప్రాధాన్యత కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి మండలంలో ఏ రోజుకు ఎన్ని దరఖాస్తులు పరిష్కారం అవుతాయో షెడ్యూల్ తయారు చేయాలని, దీనిపై తహసిల్దార్ లతో ప్రత్యేకంగా వీసీ నిర్వహించాలని కలెక్టర్, అదనపు కలెక్టర్ రెవెన్యూను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకొని రావాలని కలెక్టర్, పీడీ హౌసింగ్ ను ఆదేశించారు.ఖమ్మం అర్భన్ మినహాయించి మిగిలిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని అన్నారు. వన మహోత్సవం క్రింద జిల్లాలో గుర్తించిన బ్లాక్ ప్లాంటేషన్ స్థలాల లెవెలింగ్, గుంతల తవ్వకం పనులు, అవసరమైన మొక్కలు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రుల చే మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
నర్సరీలో ఉన్న ఎత్తైన మొక్కల లెక్కలు పక్కాగా తీయాలని అన్నారు. మన దగ్గర ఎన్ని ఎత్తైన మొక్కలు అందుబాటులో ఉన్నాయి, బయట నుంచి ఎంత ప్రొక్యూర్ చేసుకోవాలో రిపోర్ట్ అందించాలని అన్నారు. బ్లాక్ ప్లాంటేషన్ కోసం గుర్తించిన స్థలాలలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించాలని అన్నారు.
పౌర సరఫరాల శాఖలో గన్ని బ్యాగుల రికన్సీలేషన్ పక్కాగా జరిగేలా చూడాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన రేషన్ కార్డుల పంపిణీకోసం మంత్రి , స్థానిక నాయకుల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా, సత్తుపల్లి కు నూతనంగా మంజూరైన ఐటిఐ ఏటీసీ కేంద్రాల నిర్మాణానికి అనువైన స్థలాల ఎంపిక పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, డిఆర్డిఓ సన్యాసయ్య, డిపిఓ ఆశాలత, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి బాయి, హౌసింగ్ పి.డి. శ్రీనివాస్,
బిసి అభివృద్ధి అధికారి జి. జ్యోతి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, డి.డబ్ల్యూ.ఓ. కె. రాంగోపాల్ రెడ్డి, కార్మిక శాఖ, అటవీ, సంబంధిత శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.