- మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తీర్పు
- సోషల్ మీడియా ద్వారా చిన్నారులకు అసభ్యకర సందేశాలు పంపిన వైనం
- నిందితుడి వాదనలు తోసిపుచ్చిన వర్జీనియా కోర్టు
మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అమెరికాలో నివసిస్తున్న ఓ తెలుగు వ్యక్తికి స్థానిక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన తాళ్లూరు ఫణి (52) ఈ కేసులో దోషిగా తేలడంతో వర్జీనియాలోని ఆష్‌బర్న్ కోర్టు బుధవారం ఈ సంచలన తీర్పును వెలువరించింది.
ఫణి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మైనర్లను లక్ష్యంగా చేసుకున్నాడు. వారికి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంపుతూ లైంగికంగా వేధించేవాడు. ఓ బాలికకు తన నగ్న చిత్రాలు పంపి, బదులుగా అలాంటివే పంపాలని తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. మరో బాధితురాలు తనకు 11 నుంచి 13 ఏళ్ల వయసులో ఫణి నుంచి పలుమార్లు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని వాంగ్మూలం ఇచ్చింది.
కాగా, ఫణి వ్యవహారం 2019లోనే వెలుగులోకి వచ్చింది. దీంతో అక్కడి తెలుగు పెద్దలు రాజీకి ప్రయత్నించారు. అయితే ఇందుకు బాలిక తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో కేసుల భయంతో ఫణి భారత్‌కు వెళ్లిపోయాడు. రెండేళ్ల క్రితం మళ్లీ అమెరికాకు వచ్చాడు. ఈ క్రమంలో 2024లో ఫణిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మద్యపానం, మానసిక సమస్యలు, తల్లి మరణంతో కలిగిన ఆవేదన వల్లే తాను తప్పు చేశానని విచారణ సమయంలో ఫణి వాదించాడు. అయితే, ఈ వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇవి పొరపాటున జరిగినవి కావని, ఉద్దేశపూర్వకంగా చేసిన నేరాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆధారాలను నాశనం చేసేందుకు బాధితులపై ఒత్తిడి తేవడాన్ని కూడా కోర్టు తీవ్రంగా పరిగణించింది.
నిజానికి ఫణి వ్యవహారం 2019లోనే బయటపడగా, అప్పట్లో కొందరు తెలుగు పెద్దలు రాజీకి ప్రయత్నించారు. కానీ బాధితుల తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఫణి భారత్‌కు పారిపోయాడు. రెండేళ్ల తర్వాత తిరిగి అమెరికా వెళ్లి 2024లో అరెస్టయ్యాడు. జైలు శిక్ష పూర్తయ్యాక కూడా ఫణిపై ఐదేళ్ల పాటు పర్యవేక్షణ ఉంటుందని, జీవితాంతం లైంగిక నేరగాళ్ల రిజిస్టర్‌లో అతని పేరు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.